చంద్రన్న సేవారత్న అందుకున్న శ్రీజ సాదినేని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా pmkm fine arts వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో సినీ,రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు శ్రీజ సాదినేనిని చంద్రన్న సేవారత్న పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీజ సాదినేని ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు.పొలపల మల్లికార్జున మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు, సినీ రచయిత, నిర్మాత, దర్శకులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీజ సాదినేని ఒక ఆడపిల్ల అయినా ఎవరిపై ఆధార పడకుండా సొంతంగా తన కాళ్ళపై తాను నిలబడి ఎంతో గొప్ప స్థాయికి ఎదగడం మరెందరో అమ్మాయిలకు ఆదర్శమని, కళా రంగంలో ఆమె చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి అని శ్రీజను కొనియాడారు.చిన్నతనం నుండి కళారంగంలో అంచెలంచెలుగా ఎదిగి నటిగా,రచయిత్రిగా, దర్శకురాలిగా, నట శిక్షకురాలుగా ఎన్నో విభాగాలలో కళా సేవ చేస్తున్నందుకు ఈ గౌరవ పురస్కారం శ్రీజకు అందించడం చాలా సంతోషంగా ఉందని వెంకటరమణ తెలిపారు. సినీ రంగంలో రచయిత్రిగా, దర్శకురాలిగా అడుగులు వేస్తున్న శ్రీజ సినిమాలలో కూడా తనదైన ముద్ర వేసి విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.శ్రీజ మాట్లాడుతూ తనను రంగస్థలానికి పరిచయం చేసిన గురువు కె. శాంతిబాబు కు, గురువైన వెంకటరమణ నుండి ఈ పురస్కారాన్ని పొందడం తన అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు సినీ నాటక ప్రముఖులు పాల్గొని శ్రీజను అభినందించారు.