ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారికి జీవితసాఫల్య పురస్కారం

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారికి జీవితసాఫల్య పురస్కారం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: హైదరాబాద్ కు చెందిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, యునెస్కో వారు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటకు చెందిన దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారికి జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆచార్య కృపాచారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఆచార్య కృపాచారి తెలుగు క్రైస్తవ సాహిత్యంలో చేసిన పరిశోధనకుగాను ఈ పురస్కారాన్ని ప్రకటించినట్టు కమిటీ సబ్యులు గద్దపాక విజయరాజు తెలిపినట్లు కృపాచారి తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల పీఠాధిపతిగా పలు పదవులు నిర్వహించిన ఆచార్య కృపాచారి పర్యవేక్షణలో 75 పి.హెచ్.డి.లు, 68 ఎంఫిల్లు చేయించి పరిశోధనారంగానికి ఎనలేని సేవలు చేశారు. ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర, శ్రీకృష్ణదేవరాయ ఇత్యాది పలు విశ్వవిద్యాలయాకు 45 పాఠ్యగ్రంథాలను అందించారు. ఇంటర్, డిగ్రీతో పాటు 6, 7 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆకాశవాణి ద్వారా పలు కథలు, పాటలు, నాటికలతోపాటు చిన్నయసూరి నీతిచంద్రిక, అంబేద్కర్, బైబిల్ ధారావాహికలు ప్రసారం చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్రసమర్పణ చేశారు. కేంద్రసాహిత్య అకాడెమి సభ్యుడిగా, యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్లో పలు కీలక పదవులు, కేంద్రప్రభుత్వంవారి ప్రణాళిక సభ్యులుగా, కొన్ని అత్యున్నత స్థాయి సలహామండలి సభ్యులుగా పనిచేశారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అమెరికావారి అంతర్జాతీయ పురస్కారం, జాషువ జీవిత కాలపు పురస్కారం, ఉగాది పురస్కారాలతో పాటు పలుమార్లు జీవన సాఫల్య పురస్కారాలు ఆచార్య కృపాచారి గతంలో అందుకున్నారు.